బ్రో సినిమాతో పవన్ కళ్యాణ్ హిట్ కొట్టగా.. మెగా స్టార్ చిరంజీవి భోళా శంకరుడిగా ఆగస్టు నెలలో సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ట్రైలర్‌తో వచ్చిన హైప్‌ను మరింత పెంచాలని చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ భావిస్తోంది. దీనిలో భాగంగా చిరంజీవి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని సూర్యాపేటలో విజయవాడ-హైదరాబాద్ హైవే పక్కన రాజు గారి తోట వద్ద మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్‌ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ కటౌట్ తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్దదని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.
భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటించారు. కీర్తి సురేష్ ఆయనకు చెల్లెలిగా కనిపించనున్నారు. కీర్తి సురేష్ ప్రియుడి పాత్రలో హీరో సుశాంత్ నటించారు. మురళీ శర్మ, షాయాజీ షిండే, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీముఖి ఇతర పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.