గీత రచయిత కులశేఖర్ క‌న్నుమూత‌

ప్రముఖ గీత రచయిత కులశేఖర్ మంగళవారం నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కన్నుమూశారు.

By Kalasani Durgapraveen  Published on  26 Nov 2024 5:43 PM IST
గీత రచయిత కులశేఖర్ క‌న్నుమూత‌

ప్రముఖ గీత రచయిత కులశేఖర్ మంగళవారం నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత ఏడాది దొంగతనం కేసులో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించిన కులశేఖర్‌కు గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ నుండి ఎలాంటి ఆఫర్లు రాలేదు. వైజాగ్‌కు చెందిన కులశేఖర్ 100కి పైగా సినిమాల్లో పాటలు రాశారు. చిత్రం, సంతోషం, నువ్వు నేను, జయం వంటి హిట్ సినిమాల‌లో ఆయ‌న పాట‌లు రాశారు. ఆరోగ్య సమస్యల కారణంగా కులశేఖర్ ఆసుపత్రిలో చేరినప్పటికీ కోలుకోలేకపోయారని సినీ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

ఆగష్టు 15, 1971న సింహాచలంలో జన్మించిన కులశేఖర్ సినిమాలకు పాటలు రాయడానికి ముందు సినిమా జర్నలిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత‌ తేజ దర్శకత్వం వహించిన 'చిత్రం' సినిమా గేయ రచయితగా ఆయ‌న‌ తొలి చిత్రం. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశారు. తర్వాత ఆర్. పి. పట్నాయక్, తేజ లతో కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల కూడా అతని మానసికంగా కుంగిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న క్ర‌మంగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు.

Next Story