టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన..
By అంజి
టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఆయన ఫిష్ వెంకట్‌గా గుర్తింపు పొందారు. గబ్బర్ సింగ్, రేసు గుర్రం, దిల్, ఆది, మిరపకాయ్ తదితర హిట్ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
1989లో ఓ స్నేహితుడి ద్వారా వెంకట్‌కు దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ పరిచయమయ్యారు. ఆ తర్వాత మాగంటి నిర్మించిన 'జంతర్ మంతర్' సినిమాతో ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'ఆది'తో వెంకట్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తనదైన కామెడీతో ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచారు. ఆయన చివరి చిత్రం 'కాఫీ విత్ ఏ కిల్లర్'
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ నెల రోజుల కిందట ఆస్పత్రిలో చేరారు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో వాటిని మార్చాలని, రూ.50 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పినట్టు ఆయన కూతురు మీడియాకు చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి ఫిష్ వెంకట్‌ను పరామర్శించి, చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. మరికొంత మంది ఆర్థిక సాయం చేశారు. అయినా కిడ్నీ దాత దొరక్కపోవడంతో ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.