మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ నెల 29(శుక్రవారం) రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పది రోజుల పాటు టికెట్ ధరను పెంచుకునే అవకాశం కల్పించింది. అన్ని థియేటర్లలో అన్నీ రకాల టికెట్ల మీద రూ.50 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది.
ఈ చిత్ర షూటింగ్ లో కొంత భాగం మారేడుమిల్లి అడవులలో జరిగింది. సినిమా నిర్మాణ వ్యయం, ఏపీలో చిత్రీకరణ చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది.
ఇక తెలంగాణలోనూ 'ఆచార్య' టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణలో ఆచార్య టికెట్ రేట్స్ మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.50 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.30 రూపాయలు పెంచుకునేలా పర్మిషన్ ఇవ్వడంతో పాటు ఐదో ఆటకు అనుమతి ఇచ్చింది.