‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట వివాదంపై బాలీవుడ్ నటి నోరా ఫతేహీ మౌనం వీడారు. ఈ పాటలోని సాహిత్యం అభ్యంతరకరంగా, అశ్లీలంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంపై స్పందించారు. తన దృష్టికి రాని అభ్యంతరకర అంశాలను ఎత్తిచూపినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కేడీ: ది డెవిల్’ కన్నడ సినిమా.. ఈ సినిమాలోని పాట హిందీ వెర్షన్ చూసిన తర్వాతే అందులోని సాహిత్యం ఇంత దారుణంగా ఉందనే విషయం తనకు తెలిసిందన్నారు. హిందీ పాటలోని సాహిత్యం మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, డబుల్ మీనింగ్‌తో ఉండటం చూసి తాను తీవ్రంగా కలత చెందానన్నారు. ఈ సాంగ్ హిందీ వెర్షన్‌లో చోటుచేసుకున్న మార్పుల గురించి తనకు తెలియదని, ఈ విషయంలో తన అనుమతి తీసుకోలేదని వివరించారు. ముఖ్యంగా కన్నడ వెర్షన్ సాంగ్ షూటింగ్ మూడేళ్ల క్రితం జరిగింది. పెద్ద సినిమా కావడం, పైగా సంజయ్‌దత్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో అంగీకరించానన్నారు. కన్నడ అర్థం కాదు కాబట్టి వారు చెప్పిన దానిపైనే ఆధారపడాల్సి వచ్చిందని, ఆ సమయంలో ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు అసభ్యకరంగా ఉన్నట్లు అనిపించలేదని తెలిపింది నోరా ఫతేహీ.