రకుల్ సినిమాకు ఆ దేశంలో ఊహించని ఎదురుదెబ్బ
Thank God Is Banned In Kuwait. అజయ్ దేవగణ్ తాజా చిత్రం 'థాంక్ గాడ్'కు చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 17 Sept 2022 6:30 PM IST
అజయ్ దేవగణ్ తాజా చిత్రం 'థాంక్ గాడ్'కు చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇతర దేశాలలో కూడా సినిమా విడుదలకు కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. తాజాగా కువైట్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందనే కారణంతో ఈ చిత్రంపై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాపై నిషేధం విధించింది. అభ్యంతరకరమైన సన్నివేశాన్ని తీసేస్తే సినిమా విడుదలకు అనుమతిస్తామని తెలిపింది.
ఈ చిత్రంలో చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ కనిపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలపై నటీనటులు, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం ట్రైలర్ సెప్టెంబర్ 9న విడుదలైంది. థాంక్స్ గాడ్ ట్రైలర్‌లో కనిపించే విధంగా, మరణానంతరం ప్రతి ఒక్కరి పాపాలను, పుణ్యాలను లెక్కించే చిత్రగుప్తుడుగా అజయ్ దేవగన్ కనిపిస్తాడు. కర్ణాటకలోని హిందూ జనజాగృతి సమితి ఈ సినిమా ట్రైలర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ జనజాగృతి సమితి ప్రతినిధి మోహన్‌గౌడ్ మాట్లాడుతూ.. ట్రైలర్‌లో నటీనటులు హిందూ దేవుళ్లను అవహేళన చేస్తూ కనిపించారని, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో హిందూ మతానికి చెందిన చిత్రగుప్తుడు, యమదేవుడిని అవహేళన చేయడం మేం ఎప్పటికీ సహించబోమని అన్నారు. ఈ ట్రైలర్ విడుదలయ్యే వరకు సెన్సార్ బోర్డు నిద్రపోయిందా?.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నందున రాష్ట్ర, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలు సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు.