సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెట్రో మీమ్.. మాస్ మహారాజ్ డైలాగ్ మరి
Telugu Petrol Memes Goes Viral. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెట్రో మీమ్.. మాస్ మహారాజ్ డైలాగ్.
By Medi Samrat Published on 3 March 2021 10:32 AM IST
పెరుగుతున్న నిత్యావసరాలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. పెట్రో, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ మనిషి బయటకు రాలేని దుస్థితి. అయితే.. పెరుగుతున్న ధరల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. అయితే సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో.. పౌరులు తాము తెలిపే వినూత్న నిరసనలు పలు మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల క్రికెట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఏకంగా 5 లీటర్ల పెట్రోల్ ను అందించడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. భోపాల్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌లో ఇలా చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై సెటైరికల్ గా చూపించారు. ఫైనల్స్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్‌కు 5 లీటర్ల పెట్రోబాటిల్‌ను బహుమతిగా అందించారు. సలావుద్దీన్ అబ్బసీ ఈ పెట్రో అవార్డును గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్ భోపాల్ కాంగ్రెస్ నాయకుడు మనోజ్‌శుక్లా ఆధ్వర్యంలో జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
అలాగే.. పెట్రోల్ ధరలు సెంచరీ దాటడంతో ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ ముందు నిలబడి పెట్రోల్ రేటు సెంచరి కొట్టేసిందోచ్ అంటూ తన నిరసనను బ్యాట్ పైకెత్తి మరీ చూపించడం కూడా దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఇలాంటి క్రమంలోనే తెలుగులో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించి.. రవితేజ హీరోగా నటించిన నేనింతే సినిమాలో డైలాగ్ కూడా ప్రస్తుతం పెట్రో మీమ్ గా సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తుంది. సినీ ఇండస్ట్రీ గూర్చి రవితేజ చెప్పిన ఆ ఎమోషనల్ డైలాగ్ థియేటర్లలో ప్రేక్షలకుల చేత చప్పట్లు కొట్టించింది.
సినిమా హిట్టయినా సినిమా తీస్తాం.. ప్లాపయినా సినిమా తీస్తాం అంటూ రవితేజ పలికిన మాటలు అభిమానులను కంటతడి పెట్టించాయి. ఆ డైలాగ్‌ను పెరిగిన పెట్రో ధరలకు అనుసంధానిస్తూ.. ఓ మీమ్ ను తయారు చేశారు మీమ్ క్రియేటర్లు. రూ. 60 ఉన్నప్పుడు రూ. 100 కొట్టించాం.. రూ. 95 అయ్యింది 100 కొట్టిస్తున్నాం.. రేపు రూ. 120 అయినా రూ.100 కొట్టిస్తాం అంటూ చేసిన మీమ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. పెరిగే ధరలతో సామాన్యుడు చేసేదేం లేదు.. రాజీ పడటమే అన్న సందేశం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది ఆ మీమ్‌లో. వైరల్ అయిన ఆ మీమ్‌ను నెటిజన్లు స్టేటస్‌లతో హోరెత్తిస్తున్నారు.