మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు.. భగ్గమంటున్న సినీ ఇండస్ట్రీ.. సహించేదే లేదంటున్న సినీ ప్రముఖులు

తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగచైతన్య తప్పుబట్టారు.

By అంజి  Published on  3 Oct 2024 6:57 AM IST
Telugu film celebrities , Minister Konda Surekha, Tollywood, KTR

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు.. భగ్గమంటున్న సినీ ఇండస్ట్రీ.. సహించేదే లేదంటున్న సినీ ప్రముఖులు

తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగచైతన్య తప్పుబట్టారు. విడాకులు అనేది జీవితంలో ఎంతో కఠినమైన నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని తామిద్దరం ఎంతో శాంతియుతంగా తీసుకున్నామని తెలిపారు. తన మాజీ భార్య, తన కుటుంబం కోసమే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నానన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం, ఆమోదయోగ్యం కానివని అన్నారు. మహిళకు మద్ధతిస్తూ గౌరవించాలని, వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సిగ్గుచేటు అని అన్నారు.

తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యానన్నారు. రాజకీయ వివాదాల్లోకి తమను లాగవద్దన్నారు. తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందన్నారు. సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్‌ గాంధీ చొరవ తీసుకోవాలని ఆమె ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు అఖిల్‌ స్పందించారు. '' అమ్మ మీ ప్రతి మాటకు నేను మద్ధతిస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కానీ కొన్ని సార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు'' అని ట్వీట్‌ చేశారు.

ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. నాగచైతన్య - సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను ప్రకటించాలని, సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటకలు చేయడం బాధించిందన్నారు. ఇలాంటి వాటిని ఫిల్మ్‌ ఇండస్ట్రీ సహించదని ట్వీట్‌ చేశారు.

చైతూ - సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని స్పందించారు. ''తాము ఏం మాట్లాడిన తప్పించుకోవచ్చని పొలిటీషియన్లు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడటం సరైంది కాదు. దీనిని అందరూ ఖండించాలి'' అని ట్వీట్‌ చేశారు.

నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్ర కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దారుణమని సీని రచయిత కోన వెంకట్‌ అన్నారు. నాగార్జున కుటుంబంపై మంత్రి వ్యాఖ్యలు బాధకరమని, ఈ విషయాన్ని రేవంత్‌ సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. ఈ వ్యాఖ్యలపై సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. దీనిని సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

మంత్రి సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని సినీ హీరో సుశాంత్‌ డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఒక మంత్రి తన కుటుంబంతో పాటు సమంతను కించపరిచే విధంగా మాట్లాడటం విని షాక్‌ అయ్యానన్నారు. ఎవరినీ బాధపెట్టి ఇలా రాజకీయాల్లోకి లాగకూడదన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనను అందరూ ఖండించాలని ట్వీట్‌ చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య డైవర్స్‌ వందశాతం కేటీఆర్‌ వల్లే అయ్యిందన్నారు. ఎన్‌ కన్వెన్షన్‌ వివాదంతో ఇది మొదలైందంటూ ఆరోపణలు చేశారు.

Next Story