బెంగళూరు పోలీసుల అదుపులో నటి హేమ
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణ జరుగుతుంది. గత నెల 20వ తేదీన బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ హాజరైంది.
By Medi Samrat Published on 3 Jun 2024 12:47 PM GMTబెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణ జరుగుతుంది. గత నెల 20వ తేదీన బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ హాజరైంది. కానీ తనకు, బెంగళూరు రేవ్ పార్టీకి ఏం సంబంధం లేదంటూ అటు మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించింది. అయితే.. పోలీసులు మాత్రం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీనటి హేమ పాల్గొన్నట్లుగా తేల్చారు.
రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్‌పై బెంగళూరు పోలీసులు దాడి చేసి పార్టీకి హాజరైన వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారందరి రక్త నమూనాలు పరీక్ష చేయగా.. అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. హేమకు కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో బెంగళూరు పోలీసులు విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న హేమ తనకు వైరల్ ఫీవర్ ఉందని.. తనకు సమయం కావాలంటూ సీసీబీ పోలీసులను కోరింది. హేమ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని సీసీబీ కొద్ది రోజుల తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసింది. అప్పుడు కూడా హేమ విచారణకు హాజరు కాలేదు.
మూడోసారి నోటీసులు అందుకున్న హేమ విచారణ నిమిత్తం బెంగళూరు సీసీబీ పోలీసుల ఎదుట హాజరైంది. ఈరోజు ఉదయం బెంగళూరు పోలీసుల ముందు హాజరైన నటి హేమను పోలీసులు విచారిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన ఇమార్ షరీఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను బెంగళూరు రేవ్ పార్టీకి పలు రకాల డ్రగ్స్ లను సప్లై చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇతనితో పాటు హేమను కూడా మరికాసేపట్లో పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అరెస్ట్ లో భాగంగానే పోలీసులు హేమకు మొదటగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం రేపు ఉదయం ఆమెను కోర్టులో హాజరు పరచనున్నట్లుగా సమాచారం.