నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూర్‌లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని బెంగళూర్ నుంచి రోడ్డు మార్గంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలోని తన నివాసానికి ఆదివారం ఉదయం తీసుకువచ్చారు. తారకరత్నను కడసారి చూసేందుకు బంధువులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌ఛాంబర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానం వరకు కొనసాగింది.
తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. తారకరత్న చితికి మోహనకృష్ణ నిప్పుపెట్టారు. చివరిసారి తారకరత్న నుదిటిపై తండ్రి మోహనకృష్ణ ముద్దుపెట్టి కన్నీరుమున్నీరయ్యారు. ఈ దృశ్యాలు అందరినీ కలచివేశాయి. తారకరత్న పాడెను చిన్నాన్న రామకృష్ణ, బాలకృష్ణ, ఇతర బంధువులు మోశారు.