చిరంజీవి సినిమాలకు సంబంధించి కీలక సూచన చేసిన తమ్మారెడ్డి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ డిజాస్టర్ గా మారడంతో
By Medi Samrat Published on 16 Aug 2023 7:01 PM ISTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ డిజాస్టర్ గా మారడంతో పలువురు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి లాంటి నటుడు రీమేక్ చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు కూడా బహిరంగంగా చెబుతూ ఉన్నారు. ఈ సమయంలో భోళాశంకర్, లూసీఫర్ వంటి రీమేక్ చిత్రాలతో చిరంజీవి నిరుత్సాహపడటం కంటే నేచురల్ సినిమాలు చేయడం మంచిదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తన ఈ అభిప్రాయాన్ని చిరంజీవితో చెప్పాలని భావించానని, కానీ సాధ్యం కాలేదన్నారు. ధైర్యం చాలకనో లేక తమ చర్చ మరో అంశంపైకి మళ్లడం వల్లనో చెప్పలేకపోయానన్నారు.
సహజత్వంతో కూడిన సినిమాలు చేయడం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారని తెలిపారు తమ్మారెడ్డి. ఒకప్పుడు చిరంజీవి అందరి కుటుంబంలో వ్యక్తిగా కనిపించేవారని, ఆ చిరంజీవి కనిపిస్తే మళ్లీ ఆ సినిమాలు ఆడతాయన్నారు. అప్పట్లో సినిమాల్లోకి వచ్చిన వారికి పని తప్ప మరో ఆలోచన లేకుండేదని, ఇప్పటికీ సినిమాపై ప్రేమ ఉన్నవాళ్లు ఉన్నప్పటికీ, చాలామంది వ్యాపారంగా చూస్తున్నారన్నారు. ఒకప్పుడు రచయితలు సూటిగా కథలు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం ఎలివేషన్లు ఇస్తున్నారన్నారు. ఇందుకు దర్శకులే రచయితలు కావడమూ కారణమన్నారు. ప్రేక్షకులకు ఉపయోగపడే ఏదో ఒక అంశం సినిమా కథలో ఉండాలని, అదీ సహజంగా ఉండాలని చెప్పారు. దానిని పక్కన పెట్టి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని అంటే సినిమాలు ఆడటం లేదన్నారు.