'మా' కార్యవర్గం ప్రమాణస్వీకారం..!
Swearing in of members of the Movie Artists Association. మాంచి రసవత్తరంగా సాగిన 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో నటుడు మంచు విష్ణు విజయం
By అంజి
మాంచి రసవత్తరంగా సాగిన 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో నటుడు మంచు విష్ణు విజయం సాధించి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కాగా ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో 'మా' కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఆయనతో పాటు కార్యవర్గ సభ్యులుగా గెలుపొందిన 15 సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మోహన్ బాబు ప్రారంభించారు. అనంతరం కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రమాణస్వీకారానికి ముందు 'మా' ఆఫీసులో మంచు విష్ణు, నరేష్‌లు తమ కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... 'మా' ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించాయన్నారు. 'మా' అనేది చిన్న వ్యవస్థ కాదని తలసాని అన్నారు. మంచు విష్ణుకు సంస్కారంతో పాటు గౌరవించడం కూడా మోహన్ బాబు నేర్పించారని అన్నారు. తన కోపంతో మోహన్ బాబు ఎంత నష్టపోయాడో ఆయన మనసుకు తెలుసునన్నారు. సమాజహితం కోసమే మోహన్‌బాబు మాట్లాడతారని, ఎప్పుడూ వ్యక్తిగగత లాభం కోసం మాట్లాడలేదని అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో విద్యాసంస్థలను నడుపుతున్నారని మంత్రి తలసాని అన్నారు. మంచి వ్యక్తులను 'మా' సభ్యులుగా ఎన్నుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు. హైదరాబాద్ సినీ హబ్‌గా ఉండాలని కేసీఆర్ సంకల్పించారని, సింగిల్ విండో ద్వారా అన్ని రకాల అనుమతులు ఇచ్చేలా శ్రీకారం చుట్టామన్నారు.
'మా' ఎన్నికల్లో మంచు విష్ణుకు పోటీగా నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓడిపోగా.. తన ప్యానెల్‌లో 11 మంది విజయం సాధించారు. అయితే వారు విష్ణు ప్యానెల్ సభ్యులతో కలిసి పనిచేయలేమంటూ రాజీనామా చేశారు. 'మా' కొత్త కార్యవర్గానికి ప్రకాష్ రాజ్, అతని ప్యానెల్ సభ్యులు ఎవరూ కూడా హాజరు కాలేదు.