కోర్టుకు ఎక్కిన సుశాంత్ తండ్రి.. ఎందుకంటే?

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇప్పటికీ మిస్టరీగా నిలిచింది.

By Medi Samrat  Published on  18 Aug 2023 4:00 PM GMT
కోర్టుకు ఎక్కిన సుశాంత్ తండ్రి.. ఎందుకంటే?

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇప్పటికీ మిస్టరీగా నిలిచింది. సుశాంత్ ఆత్మహత్య కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతూ ఉంది. సుశాంత్ జీవితం ఆధారంగా కొందరు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్లాన్ చేశారు. ఇప్పటికే 'Nyay: The Justice' అంటూ ఓ సినిమా రావడానికి సిద్ధమైంది. ఈ సినిమాపై స్టే ఇవ్వాలని సుశాంత్ తండ్రి కోర్టును కోరారు. దీన్ని స్ట్రీమింగ్ చేయకుండా ఉండడం కుదరదని వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుశాంత్ తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణ కిషోర్ సింగ్ అప్పీల్‌పై జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ ధర్మేష్ శర్మలతో కూడిన ధర్మాసనం సినీ నిర్మాతలతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. తన కుమారుడి జీవితంపై సినిమా తీయడం ద్వారా అన్యాయమైన వాణిజ్య ప్రయోజనం పొందారని సుశాంత్ తండ్రి ఆరోపించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి తరపున న్యాయవాది వరుణ్ సింగ్ కోర్టులో వాదించారు. ఈ చిత్రం నటుడి వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, కుటుంబ సభ్యుల గోప్యతను కూడా ఉల్లంఘిస్తుందని అన్నారు. దానిని తాము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేమని అన్నారు. చిత్ర నిర్మాతల తరఫు న్యాయవాది మాట్లాడుతూ, ఒక వ్యక్తి మరణించిన తర్వాత గోప్యత హక్కును క్లెయిమ్ చేయలేమని స్పష్టం చేశారు. రాజ్‌పుత్ జూన్ 14, 2020న ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. ఆ సమయంలో సుశాంత్ సింగ్ వయసు 34 సంవత్సరాలు.

Next Story