ప్రముఖ నటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐసీ కేసులో జయప్రదకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును జయప్రద మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసినా ఫలితం దక్కలేదు. ఆ శిక్షను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. జయప్రద శిక్షార్హురాలేనని స్పష్టం చేసింది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జయప్రద దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.
థియేటర్ ఉద్యోగులకు జయప్రద ఈఎస్ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్) కింద రూ.8,17,794 చెల్లించాల్సి ఉండగా... జయప్రద నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు థియేటర్ కార్మికులు ఫిర్యాదు చేశారు. దాంతో జయప్రద పైనా, ఆమె సోదరుడు రాజబాబు, బిజినెస్ పార్టనర్ రామ్ కుమార్ పైనా కేసు నమోదైంది. ఈ కేసులోనే ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు ఆరు నెలల శిక్ష విధించింది.