'పాడుతా తీయగా' కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా కీరవాణి స్వరపరిచిన పాటలు పాడిన వారికే అధిక మార్కులు లభిస్తున్నాయని గాయని ప్రవస్తి ఆరాధ్య ఆరోపించారు. తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని, తాను జీవనోపాధి కోసం పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో పాటలు పాడతానని చెప్పినప్పుడు, దానిని ఎత్తి చూపుతూ న్యాయనిర్ణేతలు తనను కించపరిచారని ఆమె వాపోయారు.
ఈ ఆరోపణలపై సింగర్, పాడుతా తీయగా జడ్జిలలో ఒకరైన సునీత స్పందించారు. సంగీత కార్యక్రమాలకు సంబంధించి టీవీ ఛానళ్లకు కొన్ని సాంకేతిక పరిమితులు ఉంటాయని, అందువల్ల అన్ని పాటలూ పాడే అవకాశం ఉండదని అన్నారు సునీత. కేవలం హక్కులు ఉన్న పాటలను మాత్రమే పోటీలో పాడాల్సి ఉంటుందని, ఈ విషయాలను ప్రేక్షకులకు కూడా వివరిస్తే బాగుంటుందని సునీత తెలిపారు. ప్రవస్తిని చిన్నప్పుడు తాను ముద్దు చేశానని, ఇప్పుడు ఈ వయసులో అలా చేస్తే బాగుండదు కదా అని అన్నారు. పోటీల్లో ఎవరు బాగా పాడినా అందరం లీనమైపోతామని, భావోద్వేగానికి గురవుతామని వివరించారు. ప్రవస్తి అన్ని విషయాలను తనకు వ్యక్తిగతంగా ఆపాదించుకుంటోందని సునీత చెప్పారు.