టాలీవుడ్ యంగ్ హీరో, నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఇంటి వాడయ్యాడు. శనివారం సుమంత్ అశ్విన్ వివాహ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. డల్లాస్‌లో రీసర్జ్ పనిచేస్తున్న దీపిక అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు సుమంత్ అశ్విన్. కోవిడ్ కారణంగా ఎలాంటి సందడి లేకుండా ఈ పెళ్లి జరిగింది.
హైదరాబాద్‌లో ఎంఎస్ రాజు ఫామ్ హౌస్ లో జరిగిన సుమంత్ అశ్విన్ వివాహ వేడుకకు.. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 'తూనీగ తూనీగ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్.. ఆ తర్వాత కోలంబస్, కేరింత, హ్యాపీ వెడ్డింగ్, అంతకుముందు.. ఆ తర్వాత వంటి చిత్రాలలో నటించి నటుడుగా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. ఇదిలావుంటే.. సుమంత్ అశ్విన్ తాజా చిత్రం 'ఇదే మా కథ' మార్చి 19న విడుదల కాబోతోంది.
ఇక ఎంఎస్ రాజు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వర్షం, శత్రువు, పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్, దేవి, దేవీ పుత్రుడు, ఒక్కడు, మనసంతా నువ్వే, నీ స్నేహం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆట, వాన, మస్కా వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. డైరెక్టర్‌గా వాన, తూనీగ తూనీగ, డర్టీ హరి వంటి చిత్రాలను తెరకెక్కించారు.