దివంగత నటి సౌందర్య, మోహన్ బాబు మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయని, సౌందర్య ప్రమాదంలో చనిపోలేదని, ప్లాన్ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ లేఖ రాసి నిరసనకు దిగారు. ఇండస్ట్రీలో సౌందర్య టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలోనే ప్రాణాలు వదిలారు. సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్ళు పైనే అవుతోంది. అయితే సౌందర్యది సహజమరణం కాదు, ఆమెను హత్య చేయించారు అంటూ ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. సౌందర్యను టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబే హత్య చేయించాడంటూ ఆరోపణలు చేశాడు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబు సినీనటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ కలెక్టర్ ఖమ్మం రూరల్ ఏసిపికి ఫిర్యాదు చేశాడు. తాను ఈ ఆరోపణలు చేసిన తర్వాత మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రాణ రక్షణ కల్పించాలని అతను కోరాడు.
ఈ వివాదంపై సౌందర్య భర్త రఘు స్పందించాడు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని సౌందర్య ఆస్తికి సంబందించి తప్పుడు ప్రచారం జరుగుతోందని, సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లేఖలో తెలిపారు రఘు. మంచు ఫ్యామిలీతో తమకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని, మోహన్ బాబును తాను గౌరవిస్తానని, మేమంతా ఒకే కుటుంబంగా ఉంటామన్నారు. మోహన్ బాబుతో ఎలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవని, దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండని ఆ లేఖలో తెలిపారు.