తెలుగోళ్ల అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో.. ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేస్తూ వస్తున్నాడు. ఆయన సహాయం అందుకున్న వాళ్ళలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సహాయం చేస్తే మరచిపోయే వాళ్లము కాదు కదా.. అందుకే సోనూ సూద్ పోస్టర్ కు క్షీరాభిషేకం చేశారు అభిమానులు. సోనూ సూద్ కూడా తన మీద చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయాడు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో సోనూ సూద్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు అభిమానులు. పులి శ్రీకాంత్ అనే అభిమాని ఈ పని చేశారు. ఈ వీడియోను సోనూ సూద్ కూడా ట్విట్టర్ లో పోస్టు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది సహాయం చేస్తూ ఉన్నాడు సోనూ సూద్. నెల్లూరు జిల్లాలో రూ. 1.5 కోట్ల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సోనూ సూద్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకకపోవడమే వారి మృతికి కారణమని తెలియడంతో తీవ్ర కలత చెందిన సోనూ సూద్ మిత్రుడు సమీర్ ఖాన్ కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించాడు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ ముందుకొచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సమీర్ తీసుకెళ్లాడు. సోనూతో ఫోన్‌లో మాట్లాడించాడు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆత్మకూరు, లేదంటే కావలిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నారు.