సోనూ సూద్.. కోవిడ్ సమయంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో కొన్ని వేల మందికి పలు రకాలుగా సాయపడి రియల్ హీరో అయ్యాడు. సోనూసూద్ చాలా మందికి తన వంతు సాయాన్ని అందిస్తూనే వస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా శివుడి ఫొటోలను షేర్ చేయడానికి బదులు ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలంటూ సోనూ ట్వీట్ చేయడం వివాదాస్పదం అయింది.
శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని సోనూ సూద్ కాస్త డిఫరెంట్ గా ప్రజలకు, తన అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. శివరాత్రికి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సన్నిహితులకు ఫొటోలు పంపించి గ్రీటింగ్స్ చెప్పడం కంటే.. ఎవరైనా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి చేతనైనంత రీతిలో సాయం అందించమని ప్రతి ఒక్కరినీ కోరారు. తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా మహాశివరాత్రి సందర్భంగా అవసరమైన వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమ శివాయ అని ఆయన ట్వీట్ చేశారు.
దీన్ని కొందరు నెటిజన్స్ తప్పుగా అర్థం చేసుకుని 'హుద హెల్ ఆర్ యు సోనూసూద్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రోల్ చేయడం ప్రారంభించారు. సోనూ సూద్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. `#whothehellareusonusood`అంటూ ట్రోల్ చేస్తున్నారు. మత విద్వేషాలను ఉసిగొల్పేలా కామెంట్ చేస్తున్నారు. హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, భక్తిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, హిందూ వ్యతిరేకి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే అభిమానులు మాత్రం ఆయనకు తమ సపోర్ట్‌ను అందిస్తున్నారు. 'ఐ సపోర్ట్ సోనూసూద్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోనూసూద్ అభిమానులు ట్రెండింగ్‌లో నిలిపారు.