వెన‌క్కి త‌గ్గిన శ్రావ‌ణ భార్గ‌వి.. వివాదానికి ముగింపు ప‌లికింది

Singer Sravana Bhargavi removed Annamayya Keerthana Audio.శ్రావ‌ణ భార్గ‌వి.. పరిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2022 3:30 AM GMT
వెన‌క్కి త‌గ్గిన శ్రావ‌ణ భార్గ‌వి.. వివాదానికి ముగింపు ప‌లికింది

శ్రావ‌ణ భార్గ‌వి.. పరిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఎంతో మంది అభిమానుల‌కు సొంతం చేసుకుంది. కాగా ఇటీవ‌ల ఆమె త‌న యూట్యూబ్ ఛానెల్‌లో అన్నమయ్య కీర్తనతో ఓ వీడియో రూపొందించి వివాదంలో చిక్కుకుంది. దైవ‌గీతాన్ని శ్రావ‌ణ భార్గ‌వి త‌న అందాన్ని వ‌ర్ణించేలా రూపొందించిన వీడియోకు జ‌త చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఓ వర్గం ఆమెను తీవ్రంగా విమ‌ర్శించ‌గా మ‌రికొంద‌రు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు. శ్రావణ భార్గవి తీరుపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలువురు నిరసనలు కూడా తెలిపారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాను వీడియోను తొల‌గించేది లేద‌ని నిన్న‌టి వ‌ర‌కు చెబుతా వ‌చ్చిన శ్రావ‌ణ భార్గ‌వి ఎట్ట‌కేల‌కు వెన‌క్కి త‌గ్గింది.

త‌న వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో వ‌స్తున్న అన్న‌మ‌య్య కీర్త‌న‌ను తొల‌గించింది. అయితే వీడియోను మాత్రం తొల‌గించ‌న‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం సంగీతం వినిపిస్తుండ‌గా ఆ వీడియో కొన‌సాగించింది.ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చింది. తానెప్పుడూ కావాలని వివాదాలను రేకెత్తించలేదని స్పష్టం చేసింది. అన్నమయ్య పట్ల విశేష గౌరవంతో ఆ వీడియో రూపొందించానని, అందుకు ఎంతో శ్రమ, సమయం ఖర్చు చేశానని వెల్లడించింది. ప్రతికూల ధోరణులకు తానెప్పుడూ దూరంగా ఉంటానని, ఏమాత్రం ప్రోత్సహించనని స్పష్టం చేసింది. 'ఆ వీడియో మ‌రొక ఆడియోతో నా ఛానెల్‌లో కొన‌సాగుతుంది. చివ‌రిగా ఎప్పుడైతే మీరు చూసే తీరు మారుతుందో అప్పుడే మార్పును కూడా చూడ‌గ‌ల‌రు. దృష్టికోణం ప్ర‌తి విష‌యంలోనూ ఉంది.' అని శ్రావ‌ణ భార్గ‌వి తెలిపింది.


Next Story