ఒమిక్రాన్ భయాల కారణంగా సినిమా రిలీజ్ లు పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి. బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ అయిన 'జెర్సీ' సినిమా విడుదల వాయిదా పడింది. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటించిన 'జెర్సీ' సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. "ప్రస్తుత పరిస్థితులు, కొత్త కోవిడ్ మార్గదర్శకాల దృష్ట్యా, మా చిత్రం జెర్సీ యొక్క థియేట్రికల్ విడుదలను వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నాము. మీ అందరి నుండి మాకు అపారమైన ప్రేమ లభించింది. ప్రతివిషయానికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అప్పటి వరకు దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి" అంటూ చిత్ర బృందం ప్రకటనను విడుదల చేసింది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన 'జెర్సీ'.. నాని తెలుగులో తీసిన చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 31, 2021న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. COVID-19 కేసుల పెరుగుదలను అరికట్టడానికి సినిమా హాళ్లు, స్పాలు మరియు జిమ్‌లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఆదేశించిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. మహారాష్ట్రలో కూడా ఆంక్షలను అమలు చేస్తున్నారు. చిత్రం తదుపరి విడుదల తేదీని మేకర్స్ ఇంకా నిర్ణయించనప్పటికీ, డిజిటల్ విడుదల గురించి పుకార్లను తోసిపుచ్చలేము. 'జెర్సీ' నిర్మాతలు నేరుగా డిజిటల్ విడుదల కోసం OTT ప్లాట్‌ఫారమ్‌తో చర్చలు జరుపుతున్నారని కూడా తెలుస్తోంది.