శనివారం రాత్రి ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు..నిషేదిత డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ముంబయి కోర్టు నిరాకరించింది. అతడితో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ దమేచాలను ముంబయి సిటీ కోర్టు ఈ నెల 7వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది.
ఆర్యన్ ఖాన్ ఓ వైపు దర్యాప్తు అధికారులకు సహకరిస్తూనే, మరోవైపు సైన్స్ పుస్తకాలను తిరగేస్తున్నాడు. ఆర్యన్ ఖాన్ కోరిక మేరకు అధికారులే ఈ పుస్తకాలను అతనికి సమకూర్చారు. ఆర్యన్ ఖాన్‌కు ఆహారంతో సహా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి. ఆర్యన్‌తో పాటు ఈ కేసులో ఇతర నిందితులకు కూడా ఎన్‌సీబీ మెస్ నుంచి అధికారులు భోజన సదుపాయం కల్పించారు. ఇంటి భోజనాన్ని లోపలకు అనుమతించడం లేదు. ఇప్పటికే వారందరి దగ్గర నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వాటిని పంపారు.