సీనియర్ హాస్య నటుడు జయ సారథి కన్నుమూత
Senior Comedian Kadali Jaya Saradhi passed away.తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హాస్యనటుడు
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2022 10:36 AM ISTతెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హాస్యనటుడు కడాలి జయ సారథి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నగరంలోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జయసారథి అంత్యక్రియలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
1942 జూన్ 26న పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో కడాలి జయ సారథి జన్మించారు. 1960లో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన 'సీతారామ కళ్యాణం' చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 'పరమానందయ్య శిష్యుల కథ', 'ఈ కాలపు పిల్లలు', 'భక్త కన్నప్ప, అత్తవారిల్లు', 'అమరదీపం', 'జగన్మోహిని', 'మన ఊరి పాండవులు', 'సొమ్మొకడిది సోకొకడిది', 'కోతల రాయుడు', 'గంధర్వ కన్య', 'మెరుపు దాడి' వంటి చిత్రాల్లో హాస్యనటుడిగా తనదైన ముద్ర వేశారు. దాదాపు 372 తెలుగు చిత్రాల్లో ఆయన నటించారు. నిర్మాతగా రెబల్ స్టార్ కృష్టంరాజు తో 'ధర్మాత్ముడు', 'అగ్గిరాజు', 'శ్రీరామ చంద్రుడు', 'విధాత' చిత్రాలను నిర్మించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా సేవలు అందించారు. సినిమాలే కాకుండా ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించి నాటకరంగానికి ఎనలేని సేవచేశారు.