టాలీవుడ్‌లో విషాదం.. అల‌నాటి న‌టి జమున కన్నుమూత

Senior Actress Jamuna passed away.తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. అల‌నాటి న‌టి జ‌మున ఇక లేరు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2023 9:12 AM IST
టాలీవుడ్‌లో విషాదం.. అల‌నాటి న‌టి జమున కన్నుమూత

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. అల‌నాటి న‌టి జ‌మున ఇక లేరు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె చికిత్స పొందుతు ఉన్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. సినీ ప్ర‌ముఖులు, అభిమానుల సంద‌ర్శ‌నార్థం ఆమె భౌతిక‌కాయాన్ని ఉద‌యం 11 గంట‌ల నుంచి ఫిల్‌చాంబ‌ర్‌లో ఉంచ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి దంప‌తుల‌కు 1936 ఆగ‌స్ట్ 30న జ‌మున జ‌న్మించారు. ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. ఆమె చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. నాట‌కాల్లో ఆమె న‌ట‌నను చూసి సినిమాల్లో అవ‌కాశం ఇచ్చారు. 'పుట్టిల్లు' చిత్రంతో వెండితెర‌పై అరంగ్రేటం చేసింది. ఆ త‌రువాత 'జయభేరి', 'భూకైలాస్', 'సంసారం', 'దొరికితే దొంగలు', 'ఏకవీర', 'శ్రీకాకుళ ఆంధ్రమహా విష్ణు', 'శ్రీకృష్ణ తులాభారం', 'మంచి మనిషి', 'గులేభాకవాలి కథ', 'పూలరంగడు', 'పూజాఫలం', 'గుండమ్మ కథ', 'మిస్సమ్మ', 'మూగమనసులు' వంటి చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేసింది.

నంద‌మూరి తార‌క రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల అంద‌రి సరసన నటించింది. ఎన్ని వైవిధ్య భ‌రిత‌మైన పాత్ర‌ల్లో న‌టించిన‌ప్ప‌టికీ స‌త్య‌భామ పాత్ర‌లో ఆమె జీవించింది అనే చెప్పాలి. ఆ పాత్ర‌లో ఆమెను త‌ప్ప ఇంకా ఎవ‌రికీ కూడా ఊహించుకోలేము.

తెలుగులోనే కాకుండా ద‌క్షిణ భార‌త బాష‌ల్లో అన్నింటిలో ఆమె న‌టించారు. దాదాపు 198 చిత్రాల్లో ఆమె న‌టించి మెప్పించారు. పలు హిందీ చిత్రాల్లో కూడా నటించారు. 1967లో 'మిలన్' అనే హిందీ చిత్రం, 1964లో విడుదలైన 'మూగ మనసులు' సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.

Next Story