టాలీవుడ్‌లో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు బాల‌య్య క‌న్నుమూత‌

Senior Actor Mannava Balayya passed away.టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు మ‌న్న‌వ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2022 5:07 AM GMT
టాలీవుడ్‌లో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు బాల‌య్య క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు మ‌న్న‌వ బాల‌య్య క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న యూస‌ఫ్‌గూడ‌లోని త‌న నివాసంలో శ‌నివారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 94 సంవ‌త్స‌రాలు. 'ఎత్తుకు పై ఎత్తు' చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. 300 పైగా చిత్రాల్లో న‌టించారు. తండ్రిగా, లాయ‌ర్‌గా ఎన్నో పాత్ర‌ల్లో ఆయ‌న న‌టించి మెప్పించారు. ప‌లు చిత్రాల‌కు నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా కూడా ప‌ని చేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా.. పుట్టిన రోజు నాడే ఆయ‌న క‌న్నుమూయ‌డం విషాద‌క‌రం.

ఈయ‌న పూర్తి పేరు మ‌న్న‌వ బాల‌య్య‌. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించారు. ఆయన తండ్రి మన్నవ గురవయ్య, తల్లి అన్నపూర్ణమ్మ. బాలయ్య కన్నవారు ఇద్దరూ సాహిత్యాభిలాషులు. చదువంటే ప్రాణం. అందువల్ల తమ అబ్బాయిని బాగా చదివించాలని తపించారు. అదే రీతిన బాలయ్య కూడా ఆ రోజుల్లోనే బి.ఇ., చదివారు. 1952లో బి.ఇ., పట్టా పుచ్చుకోగానే కాకినాడ, మద్రాసు పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ గా పనిచేశారు.

అప్పట్లోనే ఆయన నాటకాలు వేసేవారు. ఈ క్ర‌మంలో 'ఎత్తుకు పైఎత్తు' చిత్రంతో సీని రంగ ప్ర‌వేశం చేశారు. 'మనోరమ' చిత్రంలో బాలయ్య హీరోగా నటించారు. 'చివరకు మిగిలేది' ఇరుగు -పొరుగు', 'బభ్రువాహన', 'బొబ్బిలియుద్ధం', 'పాండవవనవాసము', 'వివాహబంధం',' శ్రీక్రిష్ణపాండవీయం' వంటి చిత్రాలు న‌టుడిగా బాల‌య్య‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. న‌టుడిగా వివిధ పాత్ర‌లు పోషిస్తూనే నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, క‌థా ర‌చ‌యిత‌గా త‌న ప్ర‌తిభ చూపారు. శోభ‌న్‌బాబు హీరోగా 'చెల్లెలికాపురం', కృష్ణ హీరోగా 'నేర‌ము-శిక్ష‌', చిరంజీవి క‌థానాయ‌కుడిగా 'ఊరికిచ్చిన మాట' వంటి చిత్రాల‌ను నిర్మించారు. ఇక ద‌ర్శ‌కుడిగా 'ప‌సుపు తాడు', 'నిజం చెబితే నేర‌మా', 'పోలీస్ అల్లుడు' సినిమాలు తెర‌కెక్కించారు. 'ఊరికిచ్చిన మాట' చిత్రానికి ఉత్త‌మ క‌థా ర‌చ‌యిత‌గా, 'చెల్లెలి కాపురం' సినిమాకి నిర్మాత‌గా నంది అవార్డుల‌ను అందుకున్నారు.

Next Story