మహిళా ఆటో డ్రైవర్ కు సమంత గిఫ్ట్... ఏమిటంటే..
Samantha Helps To Lady Auto Driver. కవిత అనే మహిళా ఆటో డ్రైవర్ కష్టాన్ని గుర్తించిన సమంతా ఆమెకు ఓ స్విఫ్ట్ కారును కానుకగా అందించారు.
By Medi Samrat Published on 19 April 2021 8:16 AM ISTసంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కవితకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.. ఓ కార్ షోరూం నుంచి ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకున్న కవిత..నమ్మాలో నమ్మకూడదో అనుకుంటూనే వారు చెప్పినట్లు గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా.. నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్ డిజైర్ కారును అందజేశారు. దాంతో ఇప్పుడు కవిత ఆనందానికి అవధులు లేవు.
అసలేం జరిగిందంటే..
సమంత.. తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. తను సినిమాలతోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి అనేకమందికి చేయూతనిస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కవిత అనే మహిళా ఆటో డ్రైవర్ కష్టాన్ని గుర్తించిన సమంతా ఆమెకు ఓ స్విఫ్ట్ కారును కానుకగా అందించారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో కవితకు ఆహ్వానం అందింది. అప్పటికే కవిత కష్టాలు తెలుసుకున్న సమంత ఆటో నడుపుకునే కవితకు కార్ గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు.
డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన కవితకు బాల్య వివాహం జరిగింది. భర్త రోజు తాగొచ్చి కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చింది. అక్కడ పొలం పనులకు వెళ్తూ ఏగుడురి చెల్లెళ్లను పోషించింది. తల్లి, దండ్రులు చనిపోవడంతో కుటుంబ పోషణ మరింత కష్టమైంది. దీంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్‌కి వచ్చింది. మీయాపూర్ టూ బాచుపల్లి దారిలో ఆటో నడుపుతూ ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. ఇప్పుడు కరోనా ఆమెను మరింత ఇబ్బందులు పెడుతోంది. అదే సమయంలో కవిత గురించి తెలుసుకొన్న సమంత కారును గిఫ్ట్ గా ఇచ్చి తన పెద్ద మనసును మరోసారి చాటుకుంది.