సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వజ్రాల చెవిపోగులను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఖార్‌లోని ఆమె ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. పోలీసులు దొంగతనం చేసి ఆ కమ్ములను రికవరీ చేశారు. ముంబైలోని ఖార్ పోలీసులు చెవిపోగులు దొంగిలించిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని విలేపార్లే ఈస్ట్‌లోని అంబేవాడిలో నివసించే సందీప్ హెగ్డేగా గుర్తించారు. అతను అర్పితా ఖాన్ శర్మ ఇంట్లో హౌస్ కీపర్ గా పనిచేశాడు.
ఐదు లక్షల విలువైన తన వజ్రాలు పొదిగిన కమ్మలను మేకప్ ట్రేలో ఉంచానని.. ఆ తర్వాత చూడగా అవి కనిపించలేదని అర్పిత తన పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. మే 16న ఈ ఘటన జరగ్గా, అదే రోజు రాత్రి నిందితుడిని అరెస్టు చేశారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ మోహన్ మానే ఆధ్వర్యంలో, నిందితులను అరెస్టు చేయడానికి పిఐ వినోద్ గాంకర్, పిఎస్‌ఐ లక్ష్మణ్ కాక్డే, పిఎస్‌ఐ గావ్లీ, డిటెక్షన్ సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. హెగ్డే ఇతర 11 మంది సిబ్బందితో పాటు గత నాలుగు నెలలుగా పని చేస్తున్నాడు. దొంగతనం చేసి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పారిపోయాడు. దొంగిలించిన సొత్తును అతని ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు. హెగ్డేను పోలీసు కస్టడీకి తరలించారు. అతనిపై IPC సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు. అర్పిత తన నటుడు భర్త ఆయుష్ శర్మ, ఇద్దరు పిల్లలు అయత్, అహిల్‌తో కలిసి రోడ్ నెంబర్ 17లో నివసిస్తోంది.