జనవరి 1న రెడ్ అలెర్ట్
గత కొన్ని రోజులుగా భారతదేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 31 Dec 2023 1:00 PM GMTగత కొన్ని రోజులుగా భారతదేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్న సంగతి తెలిసిందే! జనవరి 1న.. చలి ఇంకా తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. జనవరి 1న ఉత్తరభారతదేశంలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2024 న్యూ ఇయర్ నాడు ఢిల్లీ, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉందని తెలిపింది. పంజాబ్‌లోని అమృత్‌సర్, ఫతేఘర్ సాహిబ్, గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్, జలంధర్, కపుర్తలా, లూథియానా, పఠాన్‌కోట్, పాటియాలా, రూప్‌నగర్, తరన్ తరణ్ జిల్లాల్లో దట్టమైన పొగమంచుతో కూడిన రోజులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. జనవరి 1న రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దట్టమైన పొగమంచు, చలి, అతి శీతల పరిస్థితులపై వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది.
ఎముకలు కొరికే చలికాలం నుండి ఉపశమనం కష్టమేనని అంటున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. 2024 జనవరి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. 9 నుండి 6 డిగ్రీల సెల్సియస్ కు దిగజారిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. దట్టమైన పొగమంచు కూడా రవాణాకు అడ్డంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.