భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో బండి భగీరథ్ తోటి విద్యార్థిని దూషిస్తూ, భౌతిక దాడి చేసినట్లుగా ఉంది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ వీడియోలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కంట పడ్డాయి. దీనిపై వర్మ తన దైన శైలిలో స్పందించాడు. బండి సంజయ్ కుమారుడిని సద్దాం హుస్సేన్ లాంటి నియంత కొడుకుతో పోల్చాడు. అంతేనా.. తండ్రిని మించిపోయాడంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"ఇరాక్‌ను గడగడలాడించిన నియంత సద్దాం హుస్సేన్‌ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు ముగిసిపోయాయని అనుకున్నా. అయితే.. అతడు ఇప్పుడు మళ్లీ బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ రూపంలో పుట్టాడు" అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
ఇదిలాఉంటే.. ఈ వీడియోలపై బండి సంజయ్ స్పందించారు. పిల్లలతో రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పిల్లలు కొట్టుకుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి మనవడిపై కామెంట్లు చేస్తే తానే స్వయంగా ఖండించానని, ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులేంటని ప్రశ్నించారు బండి సంజయ్.