హైదరాబాద్: తెలుగు మూవీ ఇండస్ట్రీలో సంక్రాంతికి విడుదల బరిలో నిలిచిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకే పరిమితం చేసింది.
కాగా రెండు భారీ సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన 'మన శంకరవరప్రసార్ గారు'... ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో నిర్మితమైన 'ది రాజాసాబ్' చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల రేట్ల పెంపుదల, ప్రీమియర్ షోల కోసం ఈ రెండు చిత్ర బృందాలు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇదే సమయంలో టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల కోసం తెలంగాణ హైకోర్టును చిత్ర బృందాలు ఆశ్రయించాయి. దీంతో కోర్టు వారికి ఊరటనిచ్చే ఆదేశాలు జారీ చేసింది.