అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Raj Kundra sent to 14-day judicial custody in pornography case. అశ్లీల చిత్రాలను రూపొందించి యాప్‌ల ద్వారా ప్రదర్శించిన కేసులో
By Medi Samrat Published on 27 July 2021 9:08 AM GMT
అశ్లీల చిత్రాలను రూపొందించి యాప్‌ల ద్వారా ప్రదర్శించిన కేసులో శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబయి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. రాజ్ కుంద్రాను జూలై 19న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద అరెస్టు చేసింది. మంగళవారం రాజ్ కుంద్రా పోలీసు రిమాండ్ ముగియనుండగా.. అతన్ని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతన్ని మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఇక రాజ్ కుంద్రా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణ జరగనుంది. ఇదిలావుంటే.. కుంద్రా 119 అశ్లీల చిత్రాలను ఒక వ్యక్తికి 1.2 మిలియన్ డాలర్లకు విక్రయించాలని యోచిస్తున్నట్లు.. క్రైమ్ బ్రాంచ్ గతంలో కోర్టుకు తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో కుంద్రా ఆర్మ్స్‌ప్రైమ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసినట్లు తేలిందని.. ఇది లండన్ కేంద్రంగా ఉన్న.. కెన్రిన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియోలను అప్‌లోడ్ చేయడానికి 'హాట్‌షాట్స్' యాప్‌ను కొనుగోలు చేసిందని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. అంతేకాక, పోలీసుల దర్యాప్తులో 51 అశ్లీల వీడియోలను కనుగొన్నట్లు తెలిపారు. వాటిలో 35 హాట్షాట్స్ లోగోతో, 16 బోలీఫేమ్ లోగోతో ఉన్నాయని.. వాటిని నిందితుల కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో కనుగొన్నట్లు పేర్కొన్నారు.