సంధ్య థియేటర్ తొక్కిసలాటను ప్రస్తావిస్తూ అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెడుతున్నట్టు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్.. సీఎం వ్యాఖ్యలు సరికాదన్నారు. దీంతో కాంగ్రెస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వారి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని అల్లు అర్జున్ అన్నారు. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదని వివరించారు. అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసిందని వివరించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన అభిమానులకు ఓ రిక్వెస్ట్ పెట్టారు. "నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా వుండాలని నా ఫ్యాన్స్ కు సూచిస్తున్నాను." అని తెలిపారు.