ప్రముఖ నిర్మాత మృతి

ప్రముఖ చలన చిత్ర నిర్మాత, రచయిత వి.మహేష్ శనివారం రాత్రి చెన్నై లో మరణించారు.

By Medi Samrat
Published on : 25 Feb 2024 7:45 PM IST

ప్రముఖ నిర్మాత మృతి

ప్రముఖ చలన చిత్ర నిర్మాత, రచయిత వి.మహేష్ శనివారం రాత్రి చెన్నై లో మరణించారు. బాత్ రూమ్ నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు కారణంగా మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాల మీద ప్రేమతో “మాతృమూర్తి” చిత్రంతో 1975 లో వి.మహేష్ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. నందమూరి తారకరామారావుతో, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో, మనుష్యులంతా ఒక్కటే (1976), లక్ష్మీదీపక్ దర్శకత్వంలో మహాపురుషుడు (1981), చిరంజీవి- కోడి రామకృష్ణ కాంబినేషన్ లో సింహపురి సింహం (1983), బోయిన సుబ్బారావు దర్శకత్వంలో, సుమన్, భానుప్రియలతో ముసుగు దొంగ (1985) సినిమాలను నిర్మించారు. మనుష్యులంతా ఒక్కటే చిత్రానికి ఆయన ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు.

ఆయన టీవీ రంగంలో కూడా తన మార్క్ ను చూపించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారమైన “హరి భక్తుల కథలు” ధారావాహికకు ఆయన నిర్మాత, రచయిత. ఆ ధారావాహికలో భాగమైన “విప్రనారాయణ” కు 2009వ సంవత్సరంలో ఉత్తమ టెలీ ఫిలింగా బంగారు నందితో పాటు, మరో మూడు విభాగాల్లో నంది పురస్కారాలను అందుకున్నారు. నెల్లూరు జిల్లా, కొరుటూరు వీరి స్వస్థలం. వి.మహేష్ అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ తెలిపారు. వి. మహేష్ మృతికి సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగఢ సంతాపం తెలియజేశారు.

Next Story