దివంగత హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్ గౌరవార్థం ఆదివారం ముంబైలో ప్రార్థనా సమావేశం జరగనుంది. ఆయన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జుహులోని ఇస్కాన్ టెంపుల్‌లో ప్రార్థనా సమావేశం జరగనుంది. సాయంత్రం 4:00 నుండి 6:00 గంటల వరకు ఈ సమావేశం జరుగనున్నట్లు తెలిపారు. 58 ఏళ్ల రాజు శ్రీవాస్తవ్ సెప్టెంబర్ 21న మరణించారు. గుండెపోటుతో ఆగస్ట్ 10న న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చేరినప్పటి నుంచి ఆయన లైఫ్ సపోర్టులో ఉన్నారు. రాజు శ్రీవాస్తవ్ 1980 నుండి ఎంటర్టైన్‌మెంట్ పరిశ్రమలో ఉన్నారు. 2005లో రియాలిటీ స్టాండ్-అప్ కామెడీ షో 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్' మొదటి సీజన్‌లో పాల్గొని మంచి పేరు సంపాదించుకున్నారు.
రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన రాజు శ్రీవాస్తవ్.. 2014లో సమాజ్‌వాదీ పార్టీ (కాన్పూర్ లోక్‌సభ అభ్యర్థి) లో చేరారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్‌లో అదే సంవత్సరం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరాడు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ ముఖ్యమంత్రి సహా పలువురు జాతీయ నాయకులు, ప్రముఖులు రాజు శ్రీవాస్తవ్ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు. అతనికి భార్య శిఖా శ్రీవాస్తవ్, పిల్లలు అంతారా, ఆయుష్మాన్ ఉన్నారు.