థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం
Prabhas Fans Hungama at Theatres. 'ఆగమనం.. అధర్మ విధ్వంసం' అంటూ రాముడిగా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
By Medi Samrat Published on 16 Jun 2023 2:38 PM IST'ఆగమనం.. అధర్మ విధ్వంసం' అంటూ రాముడిగా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎంతోకాలంగా వెయిట్ చేస్తోన్న ఆదిపురుష్ సినిమా థియేటర్లలోకి రావడంతో అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సినిమాహాళ్ల దగ్గర ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. థియేటర్ల అద్దాలు పగలకొడుతూ.. బీరు సీసాతో చేతులు కోసుకుంటూ.. రివ్యూ చెబుతున్న వ్యక్తిపై దాడికి దిగుతూ హల్‌చల్ చేస్తున్నారు.
ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బీరు బాటిల్ను పగలగొట్టి, దాంతో ప్రభాస్ పోస్టర్ ముందు పలుమార్లు చేయి కోసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియనప్పటికీ.. వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఆ అభిమాని ప్రవర్తన పట్ల.. అభిమానం ఉండొచ్చు గానీ, అది శృతి మించకూడదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే.. ప్రసాద్ ఐమాక్స్ వద్ద నెగిటివ్ రివ్యూ ఇచ్చిన ఓ వ్యక్తిని ప్రభాస్ అభిమానులు చితకబాదారు. మీడియా వారితో సినిమాపై మాట్లాడుతున్న అభిమానిని అడ్డుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇస్తూ వీరంగం సృష్టించారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న భ్రమరాంబ థియేటర్‌లో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్లో కూర్చున్నందుకు ఒక వ్యక్తిని కొంతమంది కలిసి చితక్కొట్టారు. శుక్రవారం ఉదయం సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన ఓ వ్యక్తి.. హనుమంతుడి కోసం ఉంచిన సీట్లో కూర్చుని కనిపించాడు. దీంతో కొంతమంది అతడిపై దాడికి పాల్పడ్డారు.
మరో ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది. పట్టణంలోని జ్యోతి థియేటర్‌లో ఆది పురుస్ సినిమా ఆలస్యంగా ప్రదర్శించడం, సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో అభిమానులు థియేటర్ అద్దాలను పగులగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.