అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆమె వయస్సు 102 ఏళ్లు. వయోభారంతో హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1924లో డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. 'సతీ అనసూయ' సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 1940లో మీర్జాపురం రాజా (మేకా రంగయ్య)తో ఆమె వివాహం జరిగింది.
ఆ తర్వాత ఆమె నిర్మాత మారారు. 'మన దేశం' సినిమాతో ఎన్టీఆర్‌ను చిత్ర రంగానికి పరిచయం చేశారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాలకు కూడా తొలి అవకాశం ఇచ్చిన ఘనత కృష్ణవేణిదే. నేపథ్య గాయనిగా కూడా కృష్ణవేణి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తూ ఆమె సినీరంగానికి అందించిన సేవలను స్మరించుకుంటున్నారు.
నటి కృష్ణవేణి మరణం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. నందమూరి తారక రామారావు నట జీవితానికి తొలుత అవకాశం ఇచ్చింది కృష్ణవేణే అని గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ సెంటినరీ, వజ్రోత్సవ వేడుకల్లో ఆమెను సత్కరించానని తెలిపారు.