'ఆదిపురుష్' సినిమాను నిషేధించాలని.. కోర్టులో పిటిషన్
Plea against Prabhas's Adipurush filed in Delhi court. హిందూ దేవుళ్లను తప్పుగా చిత్రీకరించారంటూ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాపై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
By అంజి Published on 8 Oct 2022 12:24 PM GMTహిందూ దేవుళ్లను తప్పుగా చిత్రీకరించారంటూ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాపై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' చిత్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని తిజ్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. హిందూ దేవుళ్లను తప్పుగా చిత్రీకరించారంటూ చిత్ర నిర్మాతలపై అడ్వకేట్ రాజ్ గౌరవ్ కోర్టులో పిటిషన్ వేశారు. దసరా సందర్భంగా ప్రోమో విడుదలైన తర్వాత, హిందూ దేవుళ్లను దారుణంగా చిత్రీకరించారని, ఈ సినిమా హిందూ సమాజం మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు సోమవారం సీనియర్ సివిల్ జడ్జి అభిషేక్ కుమార్ ఎదుట విచారణకు లిస్ట్ చేయబడింది.
రామాయణంలోని ప్రాథమిక అంశాలను తారుమారు చేశారని ఆరోపిస్తూ 'ఆదిపురుష్' సినిమా నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు, సహా నిర్మాత ఓం రౌత్‌లపై పిటిషన్ దాఖలైంది. సినిమాపై శాశ్వత, తప్పనిసరి నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది రాజ్ గౌరవ్ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆదిపురుష్ టీజర్‌లో రాముడిని, హనుమంతుడిని తప్పుగా చూపించారని, రాముడు సౌమ్య స్వభావం క్షమా గుణం కలవాడని, అలాంటి వాడిని తోలు పట్టీలు, పాదరక్షలుగా ధరించిన వాడిగా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాముడిని దారుణాలు చేసేవాడిగా చూపించారని, ఇక గొప్ప శివభక్తుడు, బ్రహ్మణుడైన రావణుడిని చాలా భయంకరంగా చిత్రీకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
మతపరమైన మనోభావాలు దెబ్బతీస్తున్న దృష్ట్యా జనవరి 12 2023న విడుదల కానున్న ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలి. భారతదేశం సహా ఇతర ప్రాంతాలలోని హిందువుల ఆకాంక్షలు, మనోభావాలను కాపాడాలి" అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే విడుదలైన ఆదిపురుష్ టీజర్ను అన్ని సమాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా ఆదేశించాలని పిటిషన్ ద్వారా కోరారు.