ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరుతో సోషల్ మీడియాలో ఏఐ (AI) ద్వారా సృష్టించిన తప్పుడు, తప్పుదోవ పట్టించే కంటెంట్ విస్తృతంగా ప్రచారం అవుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అలాంటి కంటెంట్ వల్ల తన ప్రతిష్ఠ, గోప్యత, భద్రతకు భంగం కలుగుతోందని అకిరా నందన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన పేరు, ఫోటోలు, వీడియోలు లేదా డీప్‌ఫేక్ రూపంలో రూపొందించిన కంటెంట్‌ను అనుమతి లేకుండా ప్రచారం చేయకుండా నిలువరించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ కంటెంట్ షేరింగ్ వెబ్‌సైట్లకు అటువంటి కంటెంట్‌ను తొలగించడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆంక్షలు విధించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌లు వ్యక్తిగత హక్కులకు పెద్ద ముప్పుగా మారుతున్న నేపథ్యంలో ఈ కేసు ముఖ్యమైన న్యాయపరమైన అంశాలను లేవనెత్తుతోంది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉంది