సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో నాకు తెలియదు: పవన్‌ కల్యాణ్‌

పోడియం లేకపోతే మాట్లాడటం కష్టంగా ఉందని 'హరి హర వీరమల్లు' సినిమా ప్రెస్‌మీట్‌లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

By అంజి
Published on : 21 July 2025 12:40 PM IST

Pawan Kalyan, Hari Hara Veeramallu, Tollywood

సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో నాకు తెలియదు: పవన్‌ కల్యాణ్‌

పోడియం లేకపోతే మాట్లాడటం కష్టంగా ఉందని 'హరి హర వీరమల్లు' సినిమా ప్రెస్‌మీట్‌లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 'పోడియం లేకపోతే నగ్నంగా ఉన్నట్టుంది. మీడియా వాళ్లతో పొలిటికల్‌ ఇంటరాక్షన్‌ చేశాను. కానీ జీవితంలో తొలిసారి సినిమా కోసం ఇలా చేస్తున్నా. సినిమాకు సంబంధించి మాట్లాడటానికి నాకు కొంచెం మొహమాటం. నేను చాలా యాక్సిడెంటల్‌ యాక్టర్‌ని. సినిమాలను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో తెలియదు' అని పవన్‌ వ్యాఖ్యానించారు. 'హరిహర వీరమల్లు' సినిమా ఎన్నో అడ్డంకులు చూసిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్‌ సీన్స్‌ చేశామన్నారు.

కరోనా సహా ఎన్నో ఇబ్బందులు ఈ సినిమా నిర్మాణంలో ఎదురుయ్యాయని తెలిపారు. సినిమాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన నిర్మాత ఎ.ఎం.రత్నం., మేకప్‌ మ్యాన్‌ నుంచి నిర్మాత వరకు ఆయన ఎదిగారని అన్నారు. తన చిత్రాలను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో తెలియదని, రత్నం లాంటి నిర్మాతకు అండగా ఉండాలనే ఈ సమావేశం అని చెప్పారు. ఈ సినిమాకు క్లైమాక్స్‌ ఆయువు పట్టని, కోహినూర్‌ వజ్రం చుట్టూ కథ తిరుగుతుందని చెప్పారు. తనకు సినిమా అన్నం పెట్టిందని, సినిమా అంటే తనకు ప్రాణవాయువుతో సమానం అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

కాగా పవన్‌ కల్యాణ్‌ మెయిన్‌ రోల్‌లో నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమా 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాకు క్రిష్‌, జ్యోతికీష్ణ దర్శకులు వ్యవహరించారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. ఏఏం రత్నం ఈ సినిమాను నిర్మించారు. జులై 24వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

Next Story