ఎంపీ, స్టార్ హీరోయిన్ పెళ్లికి భారీ భ‌ద్ర‌త

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

By Medi Samrat  Published on  22 Sept 2023 4:06 PM IST
ఎంపీ, స్టార్ హీరోయిన్ పెళ్లికి భారీ భ‌ద్ర‌త

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరిద్దరి పెళ్లికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లి కార్యక్రమాలు ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి. వీరిద్దరూ 24న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనున్నారు. ఈ క్ర‌మంలోనే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా గురువారం ఉదయం ఉదయపూర్‌కు బయలుదేరి వెళ్లారు. పరిణీతి చోప్రా పెళ్లిలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాస్ట్యూమ్‌ను ధరించబోతోంది. తాజాగా వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కు సంబంధించిన పూర్తి భద్రతకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది.

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల‌ వివాహ వేదిక 'హోటల్ లీలా ప్యాలెస్' వద్ద చాలా గట్టి భద్రత ఉండబోతోంది. రాఘవ్ చద్దా ఒక హోటల్ నుండి పూర్తిగా అలంకరించబడిన పడవలో పరిణీతి చోప్రాను మేవారి స్టైల్‌లో తీసుకెళ్లడానికి లీలా ప్యాలెస్‌కి వెళతారు. దీంతో అక్క‌డ 100 మందికి పైగా సెక్యూరిటీ గార్డులు మోహరించారు. హోటల్ లీలా ప్యాలెస్‌ని పిచోలా సరస్సు మధ్యలో నిర్మించారు. సరస్సు మధ్యలో ఉన్న నాలుగైదు బోట్లలో కూడా భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఈ హోటల్‌లోని ప్రత్యేక జెట్టీపై కూడా ప్రత్యేక భద్రత ఉంటుంది.

భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని.. పరిణీతి-రాఘవ్‌ల పెళ్లిలో భద్రతను పూర్తిగా పర్యవేక్షించడానికి పోలీసులు 15 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. పరిణీతి-రాఘవ్‌ల వివాహానికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. నివేదికల ప్రకారం.. అతిథుల భద్రత కోసం పోలీసులు.. అదనపు బలగాలతో పాటు, ప్రైవేట్ గార్డులు కూడా విమానాశ్రయంలో ఉంటారు.

ముంబైకి దూరంగా పెళ్లి చేసుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయకముందే స్టార్స్ ఫోటోలు మీడియాలో రావడం చాలా సార్లు జరిగింది. అయితే పరిణీతి, రాఘవ్ చద్దా తమ పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. వీరిద్దరి వెడ్డింగ్ వీడియోలు, ఫోటోలు బయటకు రాకుండా చూసేందుకు హోటల్‌లోకి ప్రవేశించే వ్యక్తి ఫోన్ కెమెరాకు బ్లూ టేప్ ఉంచనున్న‌ట్లు తెలుస్తుంది. బ్లూ టేపును తొలగించి ఎవరైనా వీడియో, ఫొటో తీయాలని ప్రయత్నిస్తే.. దానిపై వేసిన బాణం సాయంతో పట్టుకోవచ్చు.

Next Story