అల్లు స్టూడియో ప్రారంభం.. చిరంజీవి, అల్లు అర్జున్ ఏమన్నారంటే..!

Opening of Allu Studio. ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు

By Medi Samrat  Published on  1 Oct 2022 3:55 PM IST
అల్లు స్టూడియో ప్రారంభం.. చిరంజీవి, అల్లు అర్జున్ ఏమన్నారంటే..!

ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఆయన పేరుతో నిర్మించిన అల్లు స్టూడియోస్ ను ఈరోజు ప్రారంభించారు. అల్లు రామలింగయ్య అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

చిరంజీవి మాట్లాడుతూ.. ఈరోజు అరవింద్, బన్నీ, శిరీశ్, బాబీ సినీ రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారంటే... దశాబ్దాల క్రితం పాలకొల్లులో అల్లు రామలింగయ్య మదిలో మెదిలిన ఆలోచనే కారణమని చెప్పారు. నటనపై ప్రేమతో మద్రాసుకు వెళ్లి, సినీ పరిశ్రమలో మంచి స్థానానికి చేరుకోవాలని ఆయన అనుకున్నారని అన్నారు. ఆ ఆలోచనే ఇప్పడు ఒక పెద్ద వ్యవస్థగా మారిందని అన్నారు. అల్లు వారసులు ఆయనను ప్రతి క్షణం తలుచుకుంటూ ఉండాలని చెప్పారు. అల్లు కుటుంబంలో భాగం కావడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని.. అల్లు స్టూడియో అనేది ఒక స్టేటస్ సింబల్ అని అన్నారు. అల్లు అనే బ్రాండ్ తో తరతరాల పాటు జనాలు అల్లు రామలింగయ్యను గుర్తుంచుకునేలా స్టూడియోను నిర్మించారని చెప్పారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ, తమ తాతగారి 100వ పుట్టినరోజు తమకు చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. స్టూడియోను నిర్మించాలనేని తాతగారి కోరిక అని... ఆయన జ్ఞాపకార్థం అల్లు స్టూడియోను నిర్మించామని తెలిపారు. అల్లు అరవింద్ కు సొంత సినీ నిర్మాణ సంస్థ ఉందని, స్థలాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, స్టూడియో పెట్టడం ఆయనకు పెద్ద సమస్య కాదని కొందరు అనుకొని ఉండొచ్చని చెప్పారు. డబ్బుకోసం స్టూడియోను తాము నిర్మించలేదని... తాత గారి కోరిక తీర్చేందుకు నిర్మించామని తెలిపారు.


Next Story