ఆర్.ఆర్.ఆర్. ఎంతో స్పెషల్.. కొరటాలతో సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్: తారక్

NTR About RRR Movie. తారక్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆర్.ఆర్.ఆర్. సినిమా గురించి.. తన తర్వాతి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు.

By Medi Samrat  Published on  13 May 2021 9:46 AM IST
NTR

జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే..! ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు తారక్. తాజాగా తారక్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆర్.ఆర్.ఆర్. సినిమా గురించి.. తన తర్వాతి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను ప్రేక్షకులు సినిమా థియేటర్లలోనే ఎంజాయ్ చేయాలని.. కొన్ని సినిమాలను థియేటర్లలో చూస్తేనే ఇంపాక్ట్ కలుగుతుందని.. అలాంటి సినిమానే ఇది కూడా అని చెప్పుకొచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ విషయం నిర్మాతలు ఎప్పుడూ ఆలోచించలేదు. 'బాహుబలి', 'జురాసిక్‌ పార్క్‌', 'అవెంజర్స్‌' వంటి సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆడియన్స్‌ పూర్తి స్థాయిలో ఎంజాయ్‌ చేయలేరు.. ఆర్.ఆర్.ఆర్. కూడా అలాంటిదే అని చెప్పగలను. కరోనా ఫస్ట్‌ వేవ్‌ వల్ల దాదాపు ఎనిమిది నెలలు మేజర్‌ షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు తారక్. ఈ సినిమాలో గ్రాఫిక్స్, సాంకేతికతకు సంబంధించిన పని కూడా చాలానే ఉందని.. యాక్షన్‌ సన్నివేశాల గురించి చెప్పాలంటే ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారని తెలిపారు. కరోనా ప్రభావం 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా బడ్జెట్‌ని కానీ, కథను కానీ ప్రభావితం చేయకపోయినా.. మా వర్కింగ్‌ స్పీడ్‌ని బాగా దెబ్బతీసిందని అన్నారు తారక్.

'బాహుబలి' సినిమాతో రాజమౌళి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్‌ ఇలా దేశవ్యాప్తంగా సినీ మార్కెట్స్‌ను కలిపేశారన్నారు. రాజమౌళితో 2001లో తొలిసారి నటించే సమయంలోనే ఇండియన్‌ సినిమాలో ఏదో సాధించాలనే తపన, ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం 18 నెలలుగా కష్టపడుతూనే ఉన్నాను. ఫిజికల్‌ అప్పియరెన్స్‌ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నానన్నారు. ఈ సినిమాకు ముందు నేను 71 కేజీల బరువు ఉండేవాడిని. కానీ ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది కిలోల మజిల్స్‌ పవర్‌ పెంచాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇక ఈ సినిమా గురించి ఏ విషయమైనా బయటకు చెబితే రాజమౌళి ఓ గొడ్డలి పట్టుకుని నా వెంట పడతారని ఎన్టీఆర్ నవ్వులు పూయించారు.

ఆర్ఆర్ఆర్ లో నా పాత్ర షూటింగ్ పూర్తీ అయిన తర్వాత దర్శకుడు కొరటాల శివతో పాన్‌ ఇండియా స్థాయి సినిమా చేయబోతున్నానని అన్నారు. 'కేజీఎఫ్‌' ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతూ ఉన్నానని కూడా ఎన్టీఆర్ వివరించారు. భవిష్యత్తులో నిర్మాతగా కొన్ని మంచి సినిమాలు తీయాలని ఉందని చెప్పుకొచ్చారు.


Next Story