హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే..!
No improvement in Raju Srivastava's health. హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది.
By Medi Samrat Published on 13 Aug 2022 6:06 PM IST
హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆగస్టు 10, బుధవారం గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. రాజు శ్రీవాస్తవ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. రాజు శ్రీవాస్తవ త్వరగా కోలుకోవాలని ప్రార్థించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని గురుద్వారాకు వెళ్లారు. హాస్యనటుడి బావ అయిన ప్రశాంత్ మాట్లాడుతూ రాజు పరిస్థితి ఇంతకు ముందు ఉన్నట్లే ఉందన్నారు.
రాజు శ్రీవాస్తవ ఆరోగ్యంలో పెద్దగా మెరుగుదల లేదని అతని బిజినెస్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. హాస్యనటుడు వెంటిలేటర్‌పై ఉన్నారు. "రాజు శ్రీవాస్తవ స్పృహలో లేరు. ఆయన ఆరోగ్యంలో పెద్దగా మెరుగుదల లేదు. అతని మెదడు పని చేయడం లేదు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి" అని అతను చెప్పాడు. రాజు శ్రీవాస్తవకు ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్ చికిత్స అందిస్తున్నారు.
ఆగస్టు 12న ప్రధాని నరేంద్ర మోదీ.. రాజు శ్రీవాస్తవ భార్య శిఖను ఫోన్‌లో సంప్రదించారు. రాజు శ్రీవాస్తవ చికిత్సకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాజు శ్రీవాస్తవ భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. సునీల్ బన్సాల్ రాజు శ్రీవాస్తవ భార్యను బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతో ఫోన్ లో మాట్లాడించారు. రాజు శ్రీవాస్తవ ఒక ప్రముఖ హాస్యనటుడు, అతను అనేక కామెడీ షోలలో అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్, కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ షో, శక్తిమాన్.. ఇతర వాటిలో భాగంగా ఉన్నారు. మైనే ప్యార్ కియా, తేజాబ్, బాజీగర్.. ఇలా పలు బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు.