సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో డ్రగ్స్ కోణం కూడా ఉండడంతో పలువురి పేర్లు కూడా బయటకు వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా పేరు కూడా మీడియాలో వచ్చింది. ఈ వ్యవహారంలో కొందరికి సమన్లు కూడా జారీ చేశారు. ఒకానొక దశలో రకుల్ ప్రీత్‌సింగ్ మీద కూడా కొన్ని మీడియా ఛానల్స్ కథనాలను ప్రసారం చేశాయి. ఈ వ్యవహారంతో రకుల్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా ఇష్టమొచ్చినట్లు కథనాలు ప్రసారం చేయడంతో న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్‌బీఎస్ఏ) పలు టీవీ ఛానళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
రకుల్‌పై కథనాలు ప్రసారం చేసిన జీన్యూస్, జీ24టాస్, జీ హిందూస్థానీ, టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఆజ్‌తక్, న్యూస్ నేషన్, ఏబీపీ న్యూస్ చానళ్లను కడిగిపారేసింది ఎన్‌బీఎస్ఏ. డ్రగ్స్ కేసులో రకుల్‌పై ఆరోపణలతో కూడిన కథనాలను ప్రసారం చేశారంటూ మండిపడింది. తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు గాను రకుల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జీ నెట్‌వర్క్‌కు చెందిన మూడు చానళ్లను ఎన్‌బీఎస్ఏ ఆదేశించింది. ఆ కథనాలకు సంబంధించిన లింకులు యూట్యూబ్‌లో, వెబ్‌సైట్లలో ఉంటే వెంటనే తొలగించి, వారం లోపు తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.