రాక్‌స్టార్ మూవీ నటి నర్గీస్ ఫక్రీ సిస్టర్ అలియా ఫక్రీ (43)ని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ప్రియుడు జాకబ్ (35), అతడి గర్ల్ ఫ్రెండ్ ఎటినీ (33) ఉంటున్న గ్యారేజ్‌ను ఆమె నవంబర్ 2న తగలబెట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ మరణించారు. ఏడాది క్రితం అతడు బ్రేకప్ చెప్పినా ఆమె అంగీకరించలేదని తెలిసింది. ఆ కోపంతో రగిలిపోతున్న ఆలియా 'మీరు ఈ రోజు నా చేతుల్లో చచ్చారు' అని అరుస్తూ నిప్పంటించినట్టు సాక్షులు తెలిపారు.
సంఘటన సమయంలో జాకబ్స్ మేడమీద నిద్రపోతున్నాడు. అలియా గొంతు విని ఒక సాక్షి బయటకు వచ్చి, భవనం మంటల్లో ఉందని గుర్తించినట్లు జిల్లా అటార్నీ మెలిండా కాట్జ్ కార్యాలయం పత్రికా ప్రకటన తెలిపింది. జాకబ్స్ స్నేహితురాలు ఎటినీ అప్రమత్తం కావడంతో కిందకు వచ్చి అతనిని రక్షించడానికి తిరిగి పైకి వెళ్లింది. అయినప్పటికీ, వారిలో ఎవరూ బయటపడలేదు, పొగ పీల్చడం, కాలిన గాయాల కారణంగా మరణించారని కాట్జ్ కార్యాలయం పత్రికా ప్రకటనలో తెలిపింది.
జమైకా ప్రాంతంలో ఈ ఘటన జరగగా, అలియా ఫక్రీ క్వీన్స్‌లోని పార్సన్స్ బౌలేవార్డ్‌లో నివాసం ఉంటోంది. ఆమెపై మోపబడిన అభియోగాలు రుజువైతే గరిష్టంగా జీవిత ఖైదును ఎదుర్కొంటుంది.