నారప్ప.. సినిమా రివ్యూ..!

Narappa Movie Review. తమిళ సూపర్‌హిట్‌ చిత్రం ‘అసురన్‌’కు రీమేక్‌గా ‘నారప్ప’ను తెరకెక్కించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం

By Medi Samrat  Published on  20 July 2021 4:53 AM GMT
నారప్ప.. సినిమా రివ్యూ..!

చిత్రం: నారప్ప

తారాగణం: వెంకటేష్, ప్రియమణి, శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్, రాఖీ తదితరులు

సంగీతం: మణి శర్మ

ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్

కెమెరా: శ్యాం కే నాయుడు

నిర్మాతలు: సురేష్ బాబు, కలైపులి థాను

దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల

విడుదల తెదీ: 20 జూలై 2021

తమిళ సూపర్‌హిట్‌ చిత్రం 'అసురన్‌'కు రీమేక్‌గా 'నారప్ప'ను తెరకెక్కించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. వెంకటేశ్‌ సరసన ప్రియమణి న‌టించారు. ప్రైమ్ వీడియోలో సినిమా విడుదలైంది. సినిమా థియేటర్లలో విడుదలవ్వాల్సిన సినిమా కొన్ని కారణాల వలన ఓటీటీకి పరిమితం అయింది. రీమేక్ అంటే చాలు ఒరిజినల్ కంటే అద్భుతంగా చేస్తాడని విక్టరీ వెంకటేష్ కు పేరుంది. ఇక అసురన్ సినిమాతో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ధనుష్ పోషించిన పాత్రను వెంకీ మామ పోషిస్తూ ఉన్నాడంటే అంచనాలు కూడా తారా స్థాయిలోనే ఉంటాయి. అది కూడా 17 సంవత్సరాల తర్వాత వెంకటేష్ తమిళ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లకు మంచి పేరు రావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలను నారప్ప అందుకున్నాడా.. లేదా..? అన్నది తెలుసుకుందాం..!

కథ:

రామసాగరం లో భూస్వామి పాండుసామి (నరేన్) తన సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఊర్లో అందరి భూమిని లాక్కోవాలని చూస్తుంటాడు. నారప్ప (వెంకటేష్)కు చెందిన మూడు ఎకరాలు తప్ప ఊర్లోని పొలమంతా కూడా పాండుసామి చేతుల్లోకి వెళ్తుంది. నారప్ప పెద్ద కొడుకు మునికన్నా (కార్తీక్ రత్నం) ఆవేశ పరుడు. అతను పాండుసామికి ఎదురు తిరుగుతాడు. తనకు జరిగిన అవమానంతో ముని ఖన్నాను పాండుసామి చంపేస్తాడు. తన కొడుకును చంపేశారని నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి) బాధపడుతూనే ఉంటుంది. తల్లి బాధను చూడలేక నారప్ప రెండో కొడుకు సిన్నప్ప (రాఖీ) పాండుసామిని చంపేస్తాడు. ఇక తన రెండో కొడుకును అయినా కాపాడుకోవాలని నారప్ప చేసే ప్రయత్నాలు ఏంటి? అసలు నారప్ప ఎందుకు అలా తాగుబోతుగా, ఏమీ చేతగాని వాడిలా కొడుకు ముందు నిల్చుంటాడు? నారప్ప గతం ఏంటి? భూస్వాముల ముందు నారప్ప కుటుంబం నిలిచిందా లేదా..? తన చిన్నకొడుకు సిన్నప్పని తీసుకుని అడవుల్లో తప్పించుకున్నాడా. అతని భార్య, కూతురు మిగిలారా లేదా. వాళ్లకి జరింగేందేంటి? ఈ ప్రశ్నలకి సమాధానం ఏమిటా అన్నది తెలియాలంటే ప్రైమ్ వీడియో ఓపెన్ చేయాల్సిందే..!

విశ్లేషణ:

ఒక సినిమాను రీమేక్ చేస్తే కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. కొన్ని ఒరిజినల్ కంటే చాలా బాగా తీయొచ్చు అని తెలుగులో మన స్టార్స్ ఎప్పుడో నిరూపించారు. ఇక అసురన్ లాంటి సినిమాను రీమేక్ చేస్తున్నారంటే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి విమర్శలు రాకుండా చాలా బాగా డీల్ చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇక ఎమోషనల్ సీన్స్ లో నారప్పగా వెంకటేష్ అద్భుతంగా నటించాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ హీరోగానే ఎక్కడో ఫీల్ మిస్ అయినట్లు కనిపిస్తుంది. ప్రియమణి నటన చాలా బాగుంటుంది. సిన్నప్ప పాత్రధారి (రాఖీ) బాగా చేసాడు. అసలీ పగలకి, ప్రతీకారాలకి ఈ సిన్నప్ప అమాయకత్వమే కారణం. పెద్ద కొడుకుగా చేసిన కార్తిక్ రత్నం, రంగబాబుగా కనిపించిన శ్రీతేజ్ రాణించారు. రావు రమేష్, నాజర్ ఎప్పటి లాగే మెప్పించారు. మిగతా నటీనటులంతా కొత్త మొహాలే అయినా పాత్రకు తగ్గట్టుగా ఉన్నారు.

ఇక కెమెరా పనితనం చాలా బాగుంది. ఇసుకలో ఫైట్ బాగా తీశారు. యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఫస్టాఫ్ గ్రిప్పింగ్ గా ఉన్నా సెకండాఫ్ లో కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది. ఒరిజినల్ చూసిన వారికి పెద్దగా అనిపించకపోయినా.. రీమేక్ ను చూస్తున్న వారికి మాంచి ఫుల్ మీల్స్ ఇచ్చే సినిమానే.. కాస్త వయొలెన్స్ పాళ్లు ఎక్కువగా అనిపించొచ్చు కూడా..! ఏది ఏమైనా వెంకీ మామ 'నారప్ప' ను హ్యాపీగా ఇంట్లోనో, సెల్ ఫోన్లలోనే, ల్యాప్ టాప్ లోనో చూసేయండి..!

రేటింగ్: 3/5


Next Story