ఇటీవల వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో నందమూరి నట సింహం బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని అభిమానులు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదం పై బాలకృష్ణ స్పందించారు.
రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న తరువాత బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈ వివాదం గురించి అడుగగా.. అవి యాదృచ్ఛికంగా వచ్చిన మాటలే తప్ప కావాలని అనలేదని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావును తాను బాబాయి అని పిలుస్తానని, ఆయన పిల్లల కంటే తనపైనే ఎక్కువ ప్రేమ చూపించేవారని బాలయ్య చెప్పారు. సినీ ఇండస్ట్రీకి నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్లలాంటి వారన్నారు.
పొగడ్తలకు పొంగిపోవద్దని బాబాయ్(అక్కినేని) నుంచి నేర్చుకున్నానని తెలిపారు. ఫ్లోలో వచ్చిన మాటలను తప్పుగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదని బాలయ్య చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ మరణానంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొదటిసారి నాగేశ్వరరావుకే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బాబాయ్‌పై ప్రేమ తన గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా పట్టించుకోనని స్పష్టం చేశారు.