ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో విషాద చాయలు అలముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజ్.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు సంగీతం అందించిన రాజ్.. ప్రళయగర్జన సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు. సంగీత దర్శకుడు కోటీతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పాటలు కంపోజ్ చేసాడు. వీరి జోడి రాజ్-కోటి గా ఎంతో ప్రసిద్ధి చెందింది. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రాజ్-కోటి ద్వయం సంగీతాన్ని సమకూర్చింది. రాజ్ ఒక్కరే సంగీతం అందించిన సినిమా "సిసింద్రీ". అన్ని భాషల్లో కలిపి 455 చిత్రాలకు పనిచేసిన రాజ్.. 24 చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. రాజ్ మృతి పట్ల టాలీవుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.