తెలంగాణలో థియేటర్ల మూసివేత, 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే ఎంట్రీ వార్తలపై క్లారిటీ
Movie Officials Meet With Talasani Srinivasa Yadav. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ
By Medi Samrat
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఒమిక్రాన్ నేపథ్యంలో థియేటర్లపై ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం నేపథ్యంలో మంత్రితో నిర్మాతలు, దర్శకులు భేటీ అయ్యారు. భేటీకి దిల్‌రాజు, దానయ్య, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరిస్థితులు, థియేటర్లలో ఆంక్షలపై జరుగుతున్న ప్రచారం, సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై చర్చించినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై చర్చించారు. కొన్ని సమస్యలు పెండింగ్‌లో వున్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కొత్త వేరియంట్ వస్తుందని ప్రచారం జరుగుతోందని.. అయితే ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వుందని భయపడాల్సిన అవసరం లేదని తలసాని భరోసానిచ్చారు. టికెట్ ధరలు, బెనిఫిట్ షోల విషయం ప్రభుత్వ పరిశీలనలో వుందని మంత్రి తెలిపారు.
ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడొద్దని, అపోహలు నమ్మొద్దని తలసాని అన్నారు. థియేటర్ల మూసివేత, 50 శాతం ప్రేక్షకులు అని చెప్పడం అవాస్తవమని.. ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని.. కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని మంత్రి అన్నారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్ వస్తోందని అప్రమత్తంగా ఉండాలని దర్శక నిర్మాతలకు చెప్పానని తలసాని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ 2 డోసులు దాదాపు పూర్తి అయ్యిందని మంత్రి చెప్పారు. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయని సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా వుంటుందని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. టికెట్ల ధరలు తగ్గిస్తారన్న విషయంపై సైతం మంత్రి మాట్లాడారు. ఎక్కడో ఎవరో తగ్గించారని.. మేం తగ్గించమని స్పష్టం చేశారు. సినిమా టికెట్ల ధరల సవరణ నిమిషాల్లో జరిగే పనికాదన్నారు. ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.