టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆగ్రహం వ్యక్తం చేసింది. దివంగత సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు క్రమశిక్షణ ఉల్లంఘన కింద వస్తుందని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కరాటే కళ్యాణి ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తైన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దేవుని రూపంలో ఉన్న వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి విగ్రహంతో కమ్మ, యాదవులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై తమకి ఎలాంటి అభ్యంతరం లేదని.. మహానుభావుడి విగ్రహం పెట్టడం అందరికి ఇష్టమే అన్నారు. కానీ తారకరాముని విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో తయారు చేయడంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆమె అన్నారు. ఎలక్షన్స్ వస్తుండటంతో ఓట్లకోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ అంటే ఎన్నో పాత్రలు గుర్తుకు వస్తాయని, అటువంటి తారకరాముడిని కేవలం కృష్ణుడి రూపంలో తయారు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మే 28న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఖమ్మంలో ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపారు.